ఫార్మా సిటీ నిర్మాణాన్ని నిలిపివేయాలి

SMTV Desk 2019-05-24 14:50:41  mal reddy Ranga reddy

అసెంబ్లీ ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి చాలా స్వల్ప తేడాతో ఓటమి పాలైన కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి యాచారం మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీ వలన పరిసర ప్రాంతాలలో భూమి, నీరు, గాలి అన్నీ కాలుష్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

శుక్రవారం యాచారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిరీస్ కంపెనీ కారణంగా ఇప్పటికే భూగర్భజలాలు కలుషితమయ్యాయి. ఆ నీటినే త్రాగుతుండటం వలన వందలాదిమంది ప్రజలు రోగాలపాలయ్యి నానా బాధలు పడుతున్నారు. ఇప్పుడు అటువంటి అనేక ఫార్మా కంపెనీలతో కూడిన ఫార్మా సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. యాచారంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీ వలన మరింతమంది ప్రజలు రోగాలపాలవుతారు. వాయు, జల కాలుష్యం పెరుగుతుంది కనుక పశుపక్ష్యాదులు కూడా మరణిస్తాయి. ఫార్మా సిటీ నిర్మిస్తే భవిష్యత్తులో యాచారం మండలం నుంచి ప్రజలు వేరే ప్రాంతాలకు వలసలు పోవలసివచ్చినా ఆశ్చర్యం లేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా సిటీ నిర్మాణాన్ని నిలిపివేయాలి. ఇటువంటి కాలుష్యకారకమైన పారిశ్రామికవాడాలను జనావాసాలకు దూరంగా ఎక్కడైనా ఏర్పాటు చేసుకొంటే మంచిది.

యాచారంలో ఫార్మా సిటీ ఆలోచన విరమించుకొంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల అభ్యర్ధులను కూడా పోటీ నుంచి విరమింపజేసి తెరాసకు మద్దతు ఇస్తాము. కనుక తెరాస సర్కారుకు ప్రజలే కావాలో ఫార్మా సిటీయే కావాలో నిర్ణయించుకోవాలి,” అని అన్నారు.

మల్‌రెడ్డి రంగారెడ్డి లేవనెత్తిన సమస్యలు సహేతుకమైనవే కానీ ఫార్మా సిటీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చాలాక ప్రాజెక్టుగా భావిస్తూ చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది కనుక వెనక్కు తగ్గకపోవచ్చు.