ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు ఆ డేట్ నుండి

SMTV Desk 2019-05-24 14:49:48  Intermediate Admissions

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు తేదీలు ఖరారయ్యాయి. బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక్కో తరగతిలో 88 మందికి మించి విద్యార్దులు ఉండటానికి వీలు లేదు కనుక ప్రైవేట్ జూనియర్ కాలేజీలు తదనుగుణంగానే విద్యార్దులను భర్తీ చేసుకోవాలి. మళ్ళీ రెండవ విడత ప్రవేశాలకు తేదీని త్వరలో ప్రకటిస్తాము. ఇంటర్మీడియట్‌ బోర్డు గుర్తింపు కలిగిన కాలేజీల పేర్లు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టాము కనుక వాటిలో మాత్రమే విద్యార్దులను చేర్పించాలని తల్లితండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము,” అని చెప్పారు.

మే 13న ఉదయం 11.30 గంటలకు 10వ తరగతి ఫలితాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కనుక 10వ తరగతి పాస్ అయిన విద్యార్దులకు ఇంటర్మీడియట్‌లో చేరేందుకు వారం రోజులపైనే వ్యవది ఉంటుంది కనుక ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. అయితే గుడ్డిగా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అంటూ ఏదో ఒక గ్రూప్ లో చేరిపోకుండా విద్యార్దులు తమకు పూర్తి ఆసక్తి, పట్టు ఉన్న గ్రూపులనే ఎంచుకొన్నట్లయితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవగలరు. భవిష్యత్ చదువులలో రాణించగలుగుతారు. ఇంటర్మీడియట్‌లో ఎంపిక చేసుకొనే గ్రూపుపైనే విద్యార్దుల భవిష్యత్ చదువులు, ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి కనుక ఈ దశలో తప్పటడుగు వేస్తే జీవితాంతం ఇబ్బందిపడవలసి వస్తుందని మరిచిపోకూడదు. ఈరోజుల్లో ఇంజనీరింగ్ విద్యకు డిమాండ్ తగ్గింది. వైద్యవిద్య చాలా ఖరీదైన వ్యవహరంగా మారింది. కనుక ఇంటర్మీడియట్‌లో గల వొకేషనల్ కోర్సులు వాటి ద్వారా లభించే ఉద్యోగఉపాధి అవకాశాల గురించి కూడా విద్యార్దులు, వారి తల్లితండ్రులు తెలుసుకోవడం మంచిది.