ఆంధ్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

SMTV Desk 2019-05-24 14:48:49  Imd, Temparature , AP

తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే ఎండలు మండిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా జనం జంకుతున్నారు. అయితే మరో ఐదు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 43 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చన్న అంచనాలతో ప్రజలు భయపడుతున్నారు. రాబోయే నాలుగైదు రోజుల్లో ఎండల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఏపీవ్యాప్తంగా 613 ప్రదేశాల్లో 41 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలో శని, అదివారాలు అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు, కోస్తాంధ్ర దక్షిణ ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఒడిశా నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది.