బాసర రైల్వేస్టేషన్‌లో భయాందోళనకు గురైన ప్రయాణికులు

SMTV Desk 2019-05-24 13:01:24  basar, saraswati temple, basara railway station

ప్రముఖ పుణ్యక్షేత్రం, తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతీ ఆలయం సమీపంలోని రైల్వే స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు కర్రలు, గొడ్డళ్లు, కత్తులతో హల్‌చల్‌ చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దొంగలేమో, దాడి చేస్తారేమోనన్న భయంతో వణికిపోయారు. పది మంది వరకు సభ్యులున్న ఈ ముఠా హఠాత్తుగా రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించింది. వారి చేతిలోని ఆయుధాలు చూసే సరికి ప్రయాణికుల పైప్రాణాలు పైనే పోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్టేషన్‌కి తరలివచ్చి ముఠాలోని కొందరు సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరు దొంగలా? లేక గ్యాంగ్‌ల మధ్య గొడవ కారణంగా ఇలా ఆయుధాలతో తిరుగుతున్నారా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు.