మోదీని కాకుండా మరో వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తే.....

SMTV Desk 2019-05-11 15:52:02  pm modi, nithin gadkari, national media

ప్రధానమంత్రి పదవికి తాను పోటీదారుడిని కాదని కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని కావాలనే అజెండా, కోరిక, కల తనకు లేవని చెప్పారు. ఒక వేళ బీజేపీకి మెజార్టీ తగ్గి, మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే... మోదీని కాకుండా మరో వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తే... పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు.

నరేంద్ర మోదీనే తమ నాయకుడని, ఆయనే మళ్లీ ప్రధాని అవుతారని గడ్కరీ చెప్పారు. కావాల్సినంత మెజర్టీని బీజేపీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా... మిత్రపక్షాలను కలుపుకుని పోతామని చెప్పారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళలో బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుపొందుతుందని... ఉత్తరప్రదేశ్ ఫలితాలు కూడా మీ ఆలోచనకు అంతుబట్టని విధంగా వస్తాయని తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపినంత మాత్రాన బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు.

ఉద్యోగాలు, రైతు సమస్యలకు గత ప్రభుత్వాల తప్పిదాలే కారణమని అన్నారు. ఈ ఐదేళ్లలో తాము ఎంతో మార్పును తీసుకొచ్చామని చెప్పారు. పరిస్థితిని మొత్తం మార్చడానికి ఐదేళ్ల కాలం సరిపోదని అన్నారు.