ఆ ఐదుగురిని ఉరి తీయండి: అత్యాచార బాధితురాలు

SMTV Desk 2019-05-10 17:04:31  rajasthan, alwar gang rape, gang rape victim

రాజస్థాన్‌లో అల్వార్ సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 26న ద్విచక్రవాహనంపై వెళ్తోన్న జంటను అడ్డగించిన ఐదుగురు యువకులు, వారిపై దాడిచేశారు. భర్తను గాయపరిచి, భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలేయమని బాధితురాలు అర్థించినా కామాంధులు మనసు కరగలేదు.

మూడు గంటలపాటు ఆమెకు నరకం చూపించడమే కాదు, దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. తనపై అఘాయిత్యానికి తెగబడిన ఐదుగురు కామాంధులను ఉరి తీయాలని అత్యాచార బాధితురాలు డిమాండ్ చేస్తోంది. వీరికి ఉరిశిక్ష విధిస్తే గానీ నా గుండెల్లో బాధ చల్లారదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంటర్ సెకెండియర్ చదువుతోన్న బాధితురాలు విద్యాభాస్యాన్ని కొనసాగిస్తానని తెలిపింది.

‘నాపై అత్యాచారానికి పాల్పడ్డారు.. వీడియో తీయొద్దని ప్రాధేయపడినా జాలిచూపలేదు.. నా జీవితంలో పీడకల మిగిల్చిన ఘటనకు కారణమైన ఐదుగుర్నీ ఉరి తీయాలి.. ఒకవేళ దీని కంటే దారుణమైన శిక్ష ఉంటే వారికి విధించాలి’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే పెద్దగా స్పందంచలేదని వాపోయింది. వీడియో తీసిన నిందితుడు థంగాజీపై ఫిర్యాదు చేస్తే విడిగా ఎఫ్ఐఆర్ నమోదుచేయడానికి నిరాకరించారని తెలిపింది. మే 4న ఫిర్యాదు చేయడానికి వెళ్తే, తగినంత సిబ్బంది లేరని, ఎన్నికల విధుల్లో తీరికలేకుండా ఉన్నామని సమాధానం ఇచ్చారని తెలియజేసింది.

బాధితురాలి భర్త మాట్లాడుతూ.. మా అత్తవారి ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే నిందితులు తమను అనుసరించారని తెలిపాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అడ్డగించి, తమను మెడపట్టి ఈడ్చుకెళ్లారని పేర్కొన్నాడు. అనంతరం ఒంటిపై దుస్తులు బలవంతం విప్పదీశారని అన్నాడు. మూడు గంటలపాటు నరకం చూశామని, చివరకు సాయం కోసం అరవడంతో వదిలేసి వెళ్లిపోయారని తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నారని వెల్లడించాడు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను చంపుతామని బెదిరించారని అన్నాడు.