మరింత సమయం కావాలి

SMTV Desk 2019-05-10 17:03:41  Babri case, ayodya ,

బాబ్రీ మసీదు భూ వివాదంపై సామరస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు గడువు పెంచింది. ఈ వ్యవహారంలో మధ్యంతర నివేదికను కమిటీ ఈమధ్య న్యాయస్థానానికి సమర్పించింది. దీంతో సామరస్య, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అయోధ్య పరిష్కారం కోసం ఆగస్టు 15 వరకు గడువును ఇచ్చింది.

కాగా మధ్యవర్తిత్వ కమిటీ కార్యకలాపాలన్నీ రహస్యమైనవని...వాటిని బహిర్గతం చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ కమిటీ కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలకు ఏమైనా అభ్యంతరాలుంటే జూన్‌ 30లోగా వాటిని కమిటీ ముందుకు తీసుకొచ్చేందుకు అనుమతి కూడా ఇచ్చింది. కాగా అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.