శ్రీనివాస్ రెడ్డిని ఉచ్చు బిగుస్తున్న పోలీసులు

SMTV Desk 2019-05-10 16:55:18  Hajipur, Srinivas reddy,

రాష్ట్రవ‍్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్‌ హత్యల వెనుక ఏం జరిగిందనేది పోలీసులు రాబడుతున్నారు. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి తీసుకోవడంతో ఈ కేసులో పురోగతి రానుంది.

వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్న అతడిని రాచకొండ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసును లోతుగా విచారించేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈనెల 8 నుంచి 13 వరకు విచారణ కోసం పోలీస్‌ కస్టడీకీ జడ్జి అనుమతి ఇచ్చారు. ఆ సమయంలో పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని ఏ విధమైన శారీరక, మానసిక హింసకు గురి చేయరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే దారుణమయిన హత్యలకు పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డి నేర చరిత్రపై పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. నిందితుడి స్వగ్రామం హాజీపూర్, బొమ్మలరామాం, హైదరాబాద్, వేములవాడ, కరీంనగర్, కర్నూలు ఇతర ప్రాంతాల్లో జరిగిన మిస్సింగ్‌ కేసులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నట్టు తెలిసింది. ఈ సమీప గ్రామాల్లో ఏమైనా పాడుబడిన బావులు ఉన్నాయేమోనని పోలీసులు విచారిస్తున్నారు.