విచారణకు డుమ్మా కొట్టిన రవి ప్రకాష్ , నటుడు శివాజీ

SMTV Desk 2019-05-10 16:51:10  Ravi Prakash, Shivaji, tv9

టీవీ9 యాజమాన్యానికి సంబంధించిన వివాదాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలంద మీడియా డైరెక్టర్‌ కౌశిక్‌రావు చేసిన ఫిర్యాదుతో టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి, సినీనటుడు శివాజీపై సైబరాబాద్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తి ఇళ్లతో పాటు టీవీ9 ఆఫీస్ లో కూడా పోలీసులు దర్యాప్తి జరిపారు.

అయితే ఈరోజు ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలతో టీవీ9 ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి శుక్రవారం మధ్యాహ్నం సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కానీ.. రవిప్రకాశ్‌, సినీనటుడు శివాజీ ఇంతవరకు విచారణకు హాజరుకాకపోవడం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఈరోజు వీరిద్దరూ విచారణకు హాజరుకాకపోతే మరోసారి నోటీసులు జారీ చేయాలని సీసీఎస్‌ పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా స్వార్థంతో వారి లబ్ధికోసం ఛానల్‌కు సంబంధించి నకిలీపత్రాలు సృష్టించారని.. ఫోర్జరీ చేశారని గత నెల 24న కౌశిక్‌ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సైబర్‌ క్రైం పోలీసులు మోసంతో పాటు ఐటీ చట్టం కింద రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తిలపై కేసు కూడా నమోదు చేశారు.
అంతేకాకుండా టీవీ9 కంపెనీకి సంబంధించిన సెక్రటరీని కూడా పోలీసులు ప్రశ్నించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని సీఈవో రవిప్రకాశ్‌ ఫోర్జరీ చేశారనే ఆరోపణలు రావడంతో దేవేంద్ర అగర్వాల్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారించారు.