తన రెండో భర్త తనని వేధిస్తున్నాడని అందుకే అలా చేసానని రెండో భార్య చెబుతుంది

SMTV Desk 2019-05-10 16:30:38  second marriage, married couple, widow, marriage agreement

భార్య చనిపోయిందని ఓ వృద్ధుడు... కొడుకుల సలహాతో మరో పెళ్లి చేసుకున్నాడు. కానీ.. రెండో భార్య ఇచ్చిన షాక్ కి ఆయన దిమ్మ తిరిగిపోయింది. ఆ షాక్ నుంచి కోలుకొని వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బిహార్ రాష్ట్రం గయ పట్టణానికి చెందిన నావల్ కిషోర్ శర్మ (59) ప్లైవుడ్ వ్యాపారి. నావల్ కిషోర్ భార్య మరణించడంతో ఆయన ఒంటరిగా మిగిలాడు. తన కుమారుల సలహాపై నావల్ కిషోర్ నోయిడాకు చెందిన ఇద్దరు పిల్లలున్న వితంతువును రెండో వివాహం చేసుకున్నాడు.

పెళ్లి అనంతరం తాను బీహార్ లో ఉండనని, తనకు నోయిడాలో ఇల్లు కొనమని రెండో భార్య కోరడంతో అతను రూ.42 లక్షలు వెచ్చించి నోయిడాలోని హైరైజ్ సొసైటీలో ఫ్లాట్ కొని ఆమె పేరిట పెట్టాడు. ఇళ్లు కొని నెల రోజులు గడిచింది. అంతే... వెంటనే ఆమె కిశోర్ శర్మకు విడాకులు పంపింది. వాటిని చూసి కిశోర్ శర్మ షాకయ్యాడు.

తన డబ్బుతో ఇల్లు కొనిపించిన నెలరోజులకే రెండో భార్య తనకు విడాకులు ఇచ్చి మోసగించిందని నావల్ కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నావల్ కిషోర్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు తన రెండో భర్త తనను వేధిస్తున్నాడని, అందుకే తాను విడాకులు తీసుకున్నానని రెండో భార్య చెపుతోంది. తన వద్ద నున్న నగలు, నగదుతో నోయిడాలో ఫ్లాట్ కొన్నానని రెండో భార్య చెపుతోంది. భర్తపై రెండో భార్య కూడా ఫిర్యాదు చేసింది. తాము ఇద్దరి ఫిర్యాదులు తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని నోయిడా పోలీసులు చెప్పారు.