పిట్టల్లా రాలుతున్న జనాలు....వడదెబ్బకు 16 మంది మృతి

SMTV Desk 2019-05-10 16:04:59  sunstroke, 16 died,

రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. భానుడి ప్రతాపంతో జనం విలవిల్లాడుతున్నారు. బుధవారం నల్లగొండలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 44.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్ఠంగా రికార్డైంది. ఆదిలాబాద్‌లో 44.3, రామగుండం 44, నిజామాబాద్, మహబూబ్‌నగర్ 43.5, మెదక్ 42.6, హైదరాబాద్ 42.1, హన్మకొండలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మరో మూడు రోజుల వరకు వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 46.5 నుంచి 47 డిగ్రీలకు చేరుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే భానుడి ప్రతాపానికి రెండు రాష్ట్రాల్లో 16 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎండ తీవ్రత ఈరోజు, రేపు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. ఇదే సమయంలో ఒక చల్లటి కబురు అందించింది. రానున్న నాలుగు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.