తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాల షెడ్యూల్ విడుదల

SMTV Desk 2019-05-10 14:10:12  Telangana Formation day,

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి వివిద శాఖల ముఖ్య కార్యదర్శులు, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాల నిర్వహణకు చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు.

వచ్చే నెల 2వ తేదీ నుంచి 4వరకు హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాలలో ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవ నిర్వహణ కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ఎస్.కె.జోషి తెలిపారు. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ జంటనగరాలలో, జిల్లా కేంద్రాలలో ప్రాముఖ్యత కలిగిన భవనాలను, రోడ్లను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించాలని నిర్ణయించారు. రాష్ట్రావతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్రమంతటా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవ కార్యక్రమాల వివరాలు:

హైదరాబాద్‌:

జూన్ 2వ తేదీ: పరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు. సాయంత్రం ట్యాంక్‌బండ్‌ వద్ద డ్రోన్ల ప్రదర్శన.

జూన్ 3వ తేదీ: ఎల్బీ స్టేడియంలో 1001 మంది పేరిణీ కళాకారులతో పేరిణీ నృత్య ప్రదర్శన.

జూన్ 4వ తేదీ: ఎల్బీ స్టేడియంలో 5,000 మంది ఒగ్గు కళాకారులతో కళాప్రదర్శన.

ఈమూడు రోజులలో రవీంద్రభారతి, పీపుల్స్ ప్లాజా వద్ద వివిద కళాకారులతో కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు. జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాప్రదర్శనలు నిర్వహిస్తారు.