శామ్ సంగ్ అధినేతకు ఐదేళ్ల జైలు శిక్ష‌

SMTV Desk 2017-08-25 13:58:31  Samsung chief Lee Jae-Yong, jail term, Verdict, South Korea,

దక్షిణ కొరియా, ఆగస్ట్ 25: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ శాంసంగ్‌ గ్రూప్‌ అధినేత లీ జే-యాంగ్‌కు కోర్టు 6నెలల సుధీర్ఘ విచారణ అనంతరం ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాంసంగ్‌ సీ అండ్‌ టీ, కెయిల్‌ ఇండస్ట్రీస్‌ విలీనానికి సంబంధించి ఆయన ప్రభుత్వ ఆమోదం కోసం అవినీతి చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న నేపధ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం దోషిగా పరిగణిస్తూ శిక్షను ఖరారు చేసింది. 2015లో అధ్య‌క్షురాలు పార్క్ గైన్ హై మద్దతు కోసం ప్ర‌భుత్వానికి భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు ఋజువైంది. ఇది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ కాగా మరిన్ని ఆరోపణలు లీ జే-యాంగ్‌ పై ఉండటం గమనార్హం. ఈ విలీనాన్ని షేర్‌హోల్డర్‌ ఇలియట్ అసోసియేట్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే ఈ కేసులో 12ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు అధిష్టానాన్ని కోరగా, విచారణ అనంతరం ఆయ‌న‌పై ఉన్న అన్ని కేసుల‌కు క‌లిపి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. తాజా ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు లీ జే-యాంగ్‌ వర్గాల సమాచారం.