బైక్ మీద తిరుగుతూ ప్రచారం చేసిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్

SMTV Desk 2019-05-10 12:59:29  pragna singh takur, bhopal lok sabha

వివాదాలకు మారుపేరుగా నిలిచే సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఆమె మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. సాధ్వీకి భోపాల్ ఎంపీ స్థానంలో ప్రత్యర్థి ఎవరో కాదు, కాంగ్రెస్ రాజకీయ దిగ్గజం దిగ్విజయ్ సింగ్. దాంతో ఆమె తన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. తాజాగా, భోపాల్ లో తన అనుచరులతో కలిసి రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై మీద తిరుగుతూ ప్రచారం చేశారు.

కాషాయ దుస్తుల్లో ఉన్న సాధ్వీ బైక్ వెనుక కూర్చోగా, ఓ కార్యకర్త బైక్ నడిపారు. ఎంతో ఉత్సాహంగా ప్రజల్లోకి వచ్చిన ఆమె భోపాల్ వీధుల్లో ప్రజలకు చేయి ఊపుతూ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా సాధ్వీ మాట్లాడుతూ తన ప్రత్యర్థి దిగ్విజయ్ పై విమర్శలు చేశారు. భోపాల్ ప్రజలకు సాధ్వీకి, రాక్షసుడికి తేడా తెలుసని పరోక్షంగా దిగ్విజయ్ ని రాక్షసుడిగా అభివర్ణించారు. ఇలాంటి నకిలీ వ్యక్తుల గురించి భోపాల్ ప్రజలే చూసుకుంటారని, తాను భోపాల్ ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.