రైల్వే ప్రయాణికులకు ‘బోర్డింగ్ పాయింట్’ను మార్చుకొనే వెసులుబాటు

SMTV Desk 2019-05-10 12:56:47  railways, railway ticket

దేశంలో రోజూ లక్షలాదిమంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. వారిలో చాలామంది ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్‌చేసుకొంటారు. ఒక్కోసారి అనివార్య కారణాల వలన తాము ఎక్కవలసిన స్టేషన్‌కు బదులు తరువాత ఎక్కడో ఎక్కవలసి వస్తుంటుంది. ఆలోగా టీసీ వస్తే నిబందనల ప్రకారం ఖాళీగా ఉన్న ఆ బెర్తును వేరొకరికి కేటాయిస్తుంటారు. ఎక్కవలసిన స్టేషన్లో రైలు అందుకోలేకపోవడం ఒక సమస్య అయితే, కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ బెర్తు కోల్పోవడం మరీ బాధాకరం.

ఈ సమస్యను గుర్తించిన రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యార్ధం ఫైనల్ ఛార్టు తయారుకావడానికి రెండు గంటల ముందు వరకు ‘బోర్డింగ్ పాయింట్’ను మార్చుకొనే వెసులుబాటు కల్పించింది. అయితే ఇది కేవలం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకొన్నవారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప రైల్వే స్టేషన్లో ఫేస్‌బుక్‌లో చేసుకొన్నవారికి కాదని పేర్కొంది. ఇది కేవలం ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకేనని కనుక బోర్డింగ్ స్టేషన్ మార్చుకొన్నప్పటికీ ఆ మేరకు టికెట్ రుసుమును వాపసు చేయబడదని కూడా స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవడానికిగాను రైల్వేశాఖ ఏర్పాటు చేసిన ఐఆర్సీటీసి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తరువాత ‘టికెట్ బుకింగ్ హిస్టరీ’ ఆప్షన్ ఎంచుకొని ‘బోర్డింగ్ స్టేషన్’ మార్చుకోవచ్చు.