పల్లెకెల వన్డేలో విజయం సాధించిన టీమిండియా

SMTV Desk 2017-08-25 11:40:32  India, Srilanka, ODI series, second Odi, Pallekele odi

పల్లెకెల, ఆగస్ట్ 25: భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా పల్లెకెలెలో జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 236 పరుగులు చేసి 237 పరుగుల విజయ లక్ష్యం టీమిండియా ముందు ఉంచింది. అనుకున్నట్టే వరుణుడి వల్ల ఆటకు అంతరాయం కలగటంతో మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 47 ఓవర్లలో 231 పరుగులుగా ప్రకటించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ కు అంతా శుభారంభమే అనుకుని బరిలోకి దిగిన భారత ఆటగాళ్లను ధనుంజయ ఒక్కడే కట్టడి చేయడం గమనార్హం. దీంతో 131 పరుగులకే టీమిండియా 7 కీలక వికెట్లు నష్టపోయింది. తరువాత బరిలోకి దిగిన ధోనీ, భువనేశ్వర్‌లు లంక బౌలర్‌లను నిలువరించి, లక్ష్య చేధన వైపు దూసుకువెళ్లారు. మరో 16 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 5 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 54 పరుగులు చేయగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 6 ఫోర్లు, సిక్స్‌తో 49 పరుగులు చేసి అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. ధోనీ 45 (నాటౌట్), భవనేశ్వర్ కుమార్ (53) పరుగులు చేశారు. కాగా, లంక బౌలర్లు సిరివర్ధన ఒకటి, అకిల ధనుంజయ 6 వికెట్లు తీసారు. 50 నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసిన శ్రీలంక ఆటగాళ్లలో సిరివర్ధన (58), కపుగెదెర (40), డిక్‌వెల్లా (31) రాణించగా గుణతిలక (19), మెండిస్ (19), తరంగ (9), మాథ్యూస్ (20)లు అనుకున్నంతగా అలరించలేకపోయారు. టీమిండియా బౌలర్లు బుమ్రా 4 వికెట్లు, చాహల్ రెండు, హార్ధిక్ పాండ్యా, అక్సర్ పటేల్‌లు చెరో వికెట్‌ తీశారు.