రాజీనామా చేయనున్న ఏపీ మంత్రి.

SMTV Desk 2019-05-08 16:07:52  ap mantri,

అనూహ్య పరిస్థితుల్లో మంత్ర్హి పదవి చేపట్టిన ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మరణించడంతో ఆయన కుమారుడు శ్రవణ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్‌లోకి తీసుకున్నారు. గతేడాది నవంబర్ 11న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఐతే, రాజ్యాంగం ప్రకారం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. శ్రవణ్ ఇప్పటి వరకు ఏ చట్టసభకు ఎన్నిక కాలేదు. ఆయన తాజాగా ఎన్నికల్లో పోటీ చేశారు, ఆ ఫలితాలు 23కి కానీ రావు అయితే అప్పటికే ఆరునెలల వ్యవధి ఈనెల 10వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాతి రోజు నుంచి ఆయన మంత్రిగా కొనసాగడానికి వీల్లేదు. ఆరు నెలల గడువు ముగుస్తుండటంతో రాజ్‌భవన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక మంత్రి చట్టసభల సభ్యుడు కాకపోవడంతో ఆటోమేటిక్‌గా పదవి కోల్పోవడం గౌరవప్రదంగా ఉండదని భావించిన గవర్నర్ నరసింహన్ పదో తేదీలోపే శ్రావణ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై కిడారి శ్రవణ్‌ కుమార్‌ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.