తెలంగాణ రాంరెడ్డి కన్నుమూత

SMTV Desk 2019-05-08 15:13:46  Telangana Ram Reddy,

తెలంగాణ మీద అభిమానంతో ఇంటిపేరునే తెలంగాణగా మార్చుకొన్న వ్యక్తి గుండా రాంరెడ్డి (101) మంగళవారం ఉదయం మలక్ పేట యశోదా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, హుజూర్‌నగర్‌ తాలుకా గుండ్లపల్లి గ్రామంలో 1909 లో జన్మించారు రాంరెడ్డి. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఆయన మహబూబ్‌నగర్‌ సేల్స్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తుండేవారు. తెలంగాణను ఏపీలో కలిపినందుకు నిరసనగా 1958లో ఆయన తన పదవికి రాజీనామా చేసి తన ఇంటి పేరును కూడా మార్చుకొని తెలంగాణ రాంరెడ్డిగా మారారు. 1968లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు.

‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వరకు చావను’ అని చెపుతుండేవారు. ఆయన కల నెరవేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుదలను కూడా కళ్ళారా చూసిన తరువాత చాలా ప్రశాంతంగా చనిపోయారు. తెలంగాణ ఏర్పడగానే ఆ వీర తెలంగాణ అభిమానికి తెరాస సర్కారు రూ.10 లక్షలు బహుమానంగా ఇచ్చి సత్కరించింది. తెలంగాణ రాంరెడ్డి మరణవార్త విని సిఎం కేసీఆర్‌తో సహా పలువురు తెలంగాణ ఉద్యమకారులు ఆయనకు నివాళులు అర్పించారు.