సూర్యకుమార్ క్లాస్ ఇన్నింగ్స్ ..ఫైనల్లో ముంబై ఇండియన్స్

SMTV Desk 2019-05-08 12:07:21  Mumbai Indians, Chennai, Surya Kumar

ఐపీఎల్ సీజన్‌ 12 ఫైనల్లో ముంబయి ఇండియన్స్ జట్టు అడుగు పెట్టింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో.. ఆరువికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. దీంతో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి నేరుగా ఫైనల్‌కు చేరాలనుకున్న సీఎస్‌కేకు భంగపాటు తప్పలేదు. సీఎస్‌కే నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. మరో తొమ్మిది బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ 54 బంతుల్లో 71 పరుగులతో చెలరేగడంతో ధోని సేనకు నిరాశ తప్పలేదు.

132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్‌ 4 పరుగులు, డికాక్‌ 8 పరుగులకే ఔటై నిరాశపరిచారు. ఈ దశలో ఇషాన్‌ కిషాన్‌ తో కలిసి సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. మూడో వికెట్‌ కు 80 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం.. కిషాన్‌ను తాహీర్‌ బౌల్డ్‌ చేశాడు. తరువాతి బంతికే కృనాల్‌ పాండ్యా ను డకౌట్ చేశాడు. హార్దిక్‌ పాండ్యాతో కలిసి సూర్యకుమార్‌ ముంబైను విజయతీరాలకు చేర్చాడు. సీఎస్‌కే బౌలర్లలో తాహీర్‌ రెండు వికెట్లు దక్కించుకోగా.. చాహర్‌, హర్బజన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే మ్యాచ్ ప్రారంభం నుంచి పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్‌ 6 పరుగులు, షేన్‌ వాట్సన్‌ 10 పరుగులకే ఔటవడంతో.. చెన్నై ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఆ తర్వాత సురేశ్‌ రైనా కూడా 5 పరుగులే చేసి ఔట్ కావడంతో సీఎస్‌కే కష్టాల్లో పడింది. అనంతరం మురళీ విజయ్‌-అంబటి రాయుడుల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది. వీరిద్దరూ 33 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మురళీ విజయ్‌ 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔటయ్యాడు. అంబటి రాయుడు 37 బంతుల్లో 42 పరుగులు, ధోని 29 బంతుల్లో 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించడంతో.. సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు సాధించగా, జయంత్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యాలు తలో వికెట్‌ తీశారు.

ఐపీఎల్ 12వ సీజన్‌ లో సీఎస్‌కేపై ముంబై విజయం సాధించడం ఇది మూడోసారి. అంతే కాకుండా ఐపీఎల్ లో ఐదోసారి ముంబై ఫైనల్లోకి అడుగుపెట్టిన ఘనత సాధించింది. ధోనీ సేనను ఓడించడంలో కీరోల్ పోషించిన ముంబై స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ కు ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అటు ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ విశాఖపట్నం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.