హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుము పెంపు... భారత ఐటీ కంపెనీలపై మరింత భారం

SMTV Desk 2019-05-07 15:54:02  h1b visa, donald trump

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుము పెంచేందుకు ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. దీంతో అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై ఇక నుండి మరింత ఆర్థిక భారం పడనుంది. అయితే అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్‌ ప్రొగ్రామ్‌కు నిధులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మికశాఖ మంత్రి అలెగ్జాండర్‌ అకోస్టా తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలు చేశారు. అయితే దరఖాస్తు రుసుమును ఎంత పెంచాలనుకుంటున్నారు.. ఏయే కేటగిరిలోని దరఖాస్తుదారులకు ఈ పెంపు వర్తిస్తుంది లాంటి పూర్తి వివరాలను అకోస్టా వెల్లడించేలేదు. కాగా.. హెచ్‌1బీ దరఖాస్తు రుసుమును పెంచితే గనుక ఆ ప్రభావం ఎక్కువగా భారతీయ ఐటీ కంపెనీలపైనే పడనుంది. హెచ్‌1బీ వీసాపై అమెరికా వెళ్లేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ఇప్పుడు దరఖాస్తు ఫీజు పెంచితే.. ఐటీ కంపెనీలపై ఆర్థికంగా అదనపు భారం పడుతుంది.