రీఎంట్రీతో అదరగొట్టిన స్మిత్, వార్నర్

SMTV Desk 2019-05-07 13:08:22  steve smith, david warner

సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న ఆసిస్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌లు మళ్ళీ ఆసీస్ తరపున మైదానంలోకి పునఃప్రవేశం చేశారు. వీరిద్దరూ ఇదివరకే భారత్ లో జరుగుతున్న ఐపీఎల్ లో ప్రవేశించినప్పటికీ సొంత గడ్డపై జట్టులోకి తాజాగా చేరారు. ప్రపంచకప్‌ సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆసీస్ జట్టులో పునరాగమనం చేశారు.ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్‌ 46.1 ఓవర్లలో 215 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ఖవాజా (4) త్వరగానే అవుట్ అయ్యాడు. అయితే కెప్టెన్‌ ఫించ్‌ (52), వార్నర్‌ (39)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. వార్నర్‌ పెవిలియన్ చేరిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌ (22) పర్వాలేదనిపించాడు. స్మిత్‌ నిష్క్రమించాక ఆసీస్‌ స్వల్ప వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో పేస్ బౌలర్ కౌల్టర్‌ నైల్‌ (34) సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో.. ఆసీస్ 48.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.