కనిపించిన నెలవెంక... పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

SMTV Desk 2019-05-07 12:06:12  Ramzan,

ముస్లింలకు ఎంతో పవిత్రమైనది రంజాన్ మాసం. ఆకాశంలో నెలవంక కనిపించడాన్ని బట్టి రంజాన్ మాసం ఆరంభం నిర్ణయిస్తారు. అయితే ఈ సారి రంజాన్ మాసం మంగళవారం ప్రారంభమవుతుందని హైదరాబాద్ లోని రుహియతే హిలాల్ కమిటీ పేర్కొంది. ఆదివారం నాడు నెలవంక దర్శనం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిటీ పేర్కొంది. అయితే అనూహ్యంగా నిన్న ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ఆరంభానికి మంగళవారం అనువైనదిగా ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు రంజాన్ ఉపవాసాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. రంజాన్ మాసం మంగళవారం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఎంతో పవిత్రమైన మాసం అని, నెలరోజుల పాటు నిష్టగా చేసే దీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. రంజాన్ సందర్భంగా చేసే ఉపవాసం ఆధ్యాత్మికపరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోపక్క రంజాన్ మాసం గురించి వైసీపీ అధినేత జగన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్యమాసాన్ని ముస్లిం మతస్థులు జరుపుకుంటారని, వారికి అల్లాహ్ దీవెనలు లభించాలని ఆకాంక్షించారు. మహనీయుడు మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది ఈ మాసంలోనే కావడంతో ఈ నెలకు అంత ప్రాముఖ్యత నిస్తారని అన్నారు. ‘రంజాన్’ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండగ అని ఆయన అన్నారు. అలాగే రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సమాజంలో సంతోషాన్ని, సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. సౌదీ జైళ్లలో మగ్గుతున్న 850 మంది భారతీయులను రంజాన్‌ పర్వదినంలోగా వదలిపెట్టడానికి సౌదీ అరేబియా అంగీకరించిందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.