తెలంగాణలో 3 స్థానాలకు ఉప ఎన్నికలు

SMTV Desk 2019-05-07 12:05:01  Elections,

తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎన్నికల కమిషన్ నామినేషన్ల దాఖలుకు వారంరోజుల గడువు ఇవ్వనున్నది. పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం, పార్టీ మారిన కొండా మురళీధర్‌ రావు పదవికి రాజీనామా చేయడం వల్ల స్థానిక సంస్థల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. రాజీనామా చేసిన ఈ ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి నాలుగో తేదీ వరకు ఉన్నది. ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై రెండు వరకు ఉన్నందున ఈ ఉపఎన్నికల్లో వారు ఓటువేయడానికి అర్హులు.

కొత్తగా ఎన్నికయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉండదు. ఈ మూడు స్థానాలకు మంగళవారం నుంచి మే 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 17 గడువుగా పేర్కొన్న ఎన్నికల కమిషన్ ఈ నెల 31న ఎన్నిక నిర్వహించి జూన్ 3న ఫలితాలు విడుదల చేయనున్నది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో షెడ్యూల్ విడుదలవడంతో ఆ సీట్లను ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు మంత్రులు, ఇతర ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీన్ని భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.