బీసీసీఐ తప్పిదాల వల్లే ఈ పరిస్థితి!

SMTV Desk 2019-05-06 16:41:30  sachin tendulkar, bcci

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు విషయంపై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐ ఎథిక్స్‌ ఆఫీసర్‌ జస్టిస్‌ డీకే జైన్‌ పంపిన నోటీసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడిగా ఉన్న సచిన్‌.. ముంబై ఇండియన్స్‌ ఐకాన్‌గా వ్యవహరించడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని జస్టిస్‌ జైన్‌కు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సచిన్‌కు నోటీసు పంపారు. అయితే ఈ నోటీసులపై స్పందించిన సచిన్ మాట్లాడుతూ..."నన్ను సలహా కమిటీలో నియమించిన బీసీసీఐనే ఇప్పుడు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు విషయంలో వివరణ కోరుతుండటం ఆశ్చర్యంగా ఉంది. సీఏసీలో నా బాధ్యత ఏమిటో స్పష్టంగా చెప్పాలంటూ పదే పదే కోరినా బోర్డు నుంచి స్పందన లభించలేదు. ఆ కమిటీ కేవలం సలహా మాత్రమే ఇవ్వగలదు" అని సచిన్ తెలిపాడు."దీంతో సీఏసీలో సభ్యుడిని అయినా... ముంబై ఇండియన్స్‌ జట్టు ఐకాన్‌గా కొనసాగితే వచ్చే సమస్య ఏమీ లేదు. పైగా 2013లోనే నేను ముంబై ఇండియన్స్‌ ఐకాన్‌గా ఎంపికయ్యాను. ఈ విషయం తెలిసే 2015లో బీసీసీఐ నన్ను సీఏసీలో సభ్యుడిగా ఎందుకు ఎంపిక చేసింది. దీనిపై బీసీసీఐ నుంచే వివరణ కోరండి" అని సచిన్‌ అన్నాడు.