ఇక మహిళల మెరుపులు షురూ

SMTV Desk 2019-05-06 15:06:36  womens ipl 2019

నేటి నుండి ‘మహిళల టీ20 ఛాలెంజ్’ టోర్నీ ప్రారంభం కానుంది. భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌కి చెందిన మహిళా క్రికెటర్లు మూడు జట్లుగా విడిపోయి ఈ టోర్నీలో తలపడబోతున్నాయి. ఈ మూడు జట్లకీ భారత క్రికెటర్లే కెప్టెన్లుగా ఉండటం విశేషం. టోర్నీలో వెలాసిటీ జట్టుకి మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తుండగా.. సూపర్ నోవాస్‌ టీమ్‌కి ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ వహిస్తోంది. ఇక ట్రైల్‌బ్లాజర్స్‌ జట్టుని యువ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా ముందుండి నడిపించనుంది. వాస్తవానికి ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు కూడా ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. కానీ.. బీసీసీఐతో ఓ సిరీస్‌ ఒప్పందంపై భేదాభిప్రాయాలు కారణంగా వారిని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారత్‌కి పంపలేదు. మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. సోమవారం రాత్రి 7.30 గంటలకి సూపర్ నోవాస్, ట్రైల్‌బ్లాజర్స్‌ మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఆ తర్వాత మళ్లీ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకి ట్రైల్‌బ్లాజర్స్‌, వెలాసిటీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. గురువారం రాత్రి సూపర్ నోవాస్, వెలాసిటీ టీమ్‌‌లు ఢీకొంటాయి. ఇలా ప్రతి జట్టూ.. మిగిలిన రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. చివరిగా టాప్-2లో నిలిచిన జట్లు శనివారం రాత్రి 7.30 గంటలకి ఫైనల్లో తలపడతాయి. మహిళా ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ జైపూర్ వేదికగానే జరగనున్నాయి.