రెండేళ్ళ బాలికపై లైంగికదాడి

SMTV Desk 2017-08-23 17:30:21  Hyderabad, police, Sexual harassment, Girl Child

హైదరాబాద్, ఆగస్ట్ 23: కామాంధుడి కర్కశత్వానికి ఎలాంటి పాపం తెలియని రెండేళ్ల బాలిక బలైన వైనం ఆలస్యంగా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రుల వివరాల ప్రకారం వారు తక్కుగూడలో శ్రీప్రేమ సినిమా థియేటర్‌లో పనిచేస్తున్నారు. అదే థియేటర్‌లో మహబూబ్‌నగర్‌కు చెందిన నర్సింహ(19) కూడా పనిచేస్తున్నాడు. కాగా, వీరు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. అయితే వీరి కూతురు(2) ఈ నెల 13వ తేదీన నర్సింహ తన గదిలో పాటలు వింటుండగా వెళ్లింది. కొద్ది సమయం తరువాత బాలిక ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్లగా రక్తం కారుతూ ఉండటం ఆమె గమనించింది. దీంతో ఆమె నర్సింహను నిలదీయగా తనకు ఏమి తెలియదని తెలిపాడు. బాలికను స్థానిక వైద్యులకు చూపించగా వారు ఉస్మానియాకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఉస్మానియాకు తీసుకెళ్లిన తరువాత ఉస్మానియా వైద్యులు పరీక్షించి నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించగా అక్కడికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు అక్కడి వైద్యులతో దెబ్బ తగిలిందని తెలపడంతో పరీక్షించి ఇంటికి పంపించారు. అయితే బాలికపై లైంగిక దాడి జరిగినట్లు భావించిన తల్లిదండ్రులు నర్సింహపై పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నీలోఫర్‌కు తీసుకెళ్లగా, లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో స్థానిక సీఐ నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.