పంజాబ్ ఔట్!

SMTV Desk 2019-05-06 12:05:51  ipl 2019, kxip, kxip vs csk

మొహాలీ: ఐపీఎల్ 2019 సీజన్‌‌లో భాగంగా మొహాలీ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కింగ్స్ ఎలవెన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ జట్టుకు ఈ గెలుపుతో కేవలం పాయింట్లు రాగా ప్లేఆఫ్స్ కి మాత్రం చేరుకోలేదు. ఇక ఈ విజయంతో పంజాబ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత డుప్లెసిస్ (96: 55 బంతుల్లో 10x4, 4x6), సురేశ్ రైనా (53: 38 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకాలు బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (71: 36 బంతుల్లో 7x4, 5x6) , క్రిస్‌గేల్ (28: 28 బంతుల్లో 2x4, 2x6) తొలి వికెట్‌కి 108 పరుగుల భాగస్వామ్యంతో పంజాబ్‌కి మెరుపు ఆరంభాన్నివ్వగా.. మిడిల్ ఓవర్లలో నికోలస్ పూరన్ (36: 22 బంతుల్లో 2x4, 3x6) భారీ షాట్లు ఆడటంతో మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఆ జట్టు 173/4తో అలవోక విజయాన్ని అందుకుంది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, ముంబయి జట్లు ప్లేఆఫ్ బెర్తులని ఖాయం చేసుకోగా.. ఒక బెర్తు కోసం కోల్‌కతా, హైదరాబాద్, పంజాబ్ టీమ్స్ పోటీపడ్డాయి. తాజా విజయంతో 12 పాయింట్లని ఖాతాలో వేసుకున్న పంజాబ్, హైదరాబాద్ (12 పాయింట్లు), కోల్‌కతా (12 పాయింట్లు)తో సమానంగా నిలిచింది. కానీ.. నెట్‌ రన్‌రేట్‌లో హైదరాబాద్ (+0.577) కంటే వెనక ఉన్నందున టోర్నీ నుంచి పంజాబ్ (-0.251) నిష్క్రమించక తప్పలేదు. దీంతో.. ప్రస్తుతం హైదరాబాద్, కోల్‌కతా మాత్రమే ప్లేఆఫ్ రేసులో నిలిచాయి.