భారత క్రికెట్ జట్టులో ఆడడమే నా లక్ష్యం: పరాగ్

SMTV Desk 2019-05-05 19:08:47  rajasthan royals, riyan parag

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టుపై ఢిల్లీ కాపిటల్స్ జట్టు.. 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్‌ రాయల్స్‌యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. 17 సంవత్సరాల 175 రోజుల్లోనే అర్ధశతకం చేసి ఇంతకుముందు రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ సంజూ శాంసన్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరాగ్‌ 50(49బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేసి ఐపీఎల్‌లో తన హాఫ్‌ సెంచరీ బాదాడు. పరాగ్‌ రాణించడంతో రాజస్థాన్‌ 115 పరుగులు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం పరాగ్ మీడియాతో మాట్లాడుతూ... "నా ప్రదర్శన సంతృప్తిగా ఉంది. ఇది నా తొలి ఐపీఎల్‌ సీజన్‌ కావడంతో ఇన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తుందనుకోలేదు" అని అన్నాడు."కొత్త విషయాలు నేర్చుకొని అనుభవం సంపాదించుకోవడానికే ఇక్కడికి వచ్చా. అయితే, తాను జట్టుకు ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉంది. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. అండర్‌-19 వరల్డ్‌కప్ నా కెరీర్‌లో గొప్ప మలుపు. ఇప్పుడేమో ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరపున ఆడడం చాలా సంతోషంగా ఉంది" అని రేయాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. అలాగే "భారత క్రికెట్ జట్టులో ఆడాలనే నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రెండు టోర్నీలు మెట్లు లాంటివి. వచ్చే దేశవాళీ టోర్నీతో పాటు, ఆ తర్వాతి ఐపీఎల్‌ సీజన్‌లో సత్తాచాటడంపైనే నా దృష్టంతా" అని పరాగ్‌ తెలిపాడు.