మరో వారంలో రూ. 200 నోటు

SMTV Desk 2017-08-23 15:35:44  Reserve bank of India, RBI, 200 rupees Note,

ముంబై, ఆగస్ట్ 23: ప్రస్తుతం దేశంలో ఉన్న చిల్లర కొరత దిశగా రిజర్వ్ బ్యాంక్ అడుగులు వేస్తుంది. నల్ల ధనంపై పోరుతో పెద్ద నోట్లు రద్దు చేసి, హడావిడిగా రూ. 2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసి విషయం సుపరిచితమే. అయితే ఈ నోట్లు భారీగా బ్లాక్ మార్కెట్ కి తరలిపోవడం, నకిలీ నోట్లు కూడా రావడంతో అత్యంత జాగ్రత్తగా కొత్త 200 నోటును తీసుకొచ్చే యోచనలో రిజర్వ్ బ్యాంక్ ఉంది. ఈ నోటు ఈ నెల చివ‌రిలో లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో 200 నోటు అమలులోకి రానుంది. ఈ నోట్లు బ్లాక్ మార్కెట్‌ దారి పట్టకుండా, నోట్ల కొరత రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సుమారు 50 కోట్ల 200 నోట్ల‌ను ఆర్బీఐ మార్కెట్‌లోకి తీసుకురానున్న‌ది. కొత్త నోట్ల విడుదలపై ఎస్‌బీఐ చీఫ్ ఎక‌న‌మిస్ట్ కాంతి ఘోష్ మాట్లాడుతూ 200 నోటు వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు ఇబ్బందులు ప‌డుతున్న సామాన్య జ‌నం క‌ష్టాలు తీరుతాయ‌ని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్లు మార్కెట్‌లో ఎక్కువ‌గా లేక‌పోతే.. ప‌న్నులు ఎగ్గొట్టి అక్ర‌మంగా దాచుకునే సొమ్ము కూడా త‌క్కువ‌వుతుంద‌నే యోచనలో రిజర్వ్ బ్యాంక్ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నోటు రాకతో నోట్ల రద్దు తరువాత ఏర్పడిన చిల్లర కొరత తీరుతుందని నిపుణులు తెలుపుతున్నారు. భారత చరిత్రలో మొదటిసారిగా 100 నుంచి 500 మధ్య గల విలువతో విడుదల చేస్తున్న నోటు కావడం వలన దీనికి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్లు ఆర్బీఐ అధికారి ఒక‌రు తెలిపారు.