ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది .. నితిన్ గడ్కరీ

SMTV Desk 2019-05-05 18:48:25  Nitin Gadkari,

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఐదేళ్ల బీజేపీ పాలన కేవలం ట్రైలరే అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుక పడ్డారు .

‘ఈ ఐదేళ్ల బీజేపీ పాలన కేవలం ట్రైలర్‌ మాత్రమే. అసలు సినిమా ముందుంది. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత చాలా అభివృద్ధి పనులు చేశాం. గంగా ప్రక్షాళన 1984 రాజీవ్‌ గాంధీ హయాంలో ప్రారంభమైంది. అయినా పనుల్లో మాత్రం ఎలాంటి పురోభివృద్ధి కనిపించలేదు. గంగా నదిని స్వచ్ఛంగా మార్చిన ఘనత బీజేపీదే. మసూద్‌ అజార్‌ అంశంపై బీజేపీ చొరవతోనే ప్రపంచ దేశాలన్నీ మనకు అండగా నిలిచాయి. దాంతోనే అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఏకాకిని చేయగలిగాం’ అని అన్నారు.

కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు పాలించినా, దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, ఇకపై వారు విపక్షానికే పరిమితమని ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. గడచిన 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను కాంగ్రెస్ ఎదుర్కుంటోందని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితులు లేవని అన్నారు.

దేశ స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్‌ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని.. పార్లమెంటులో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో పాటు వారి మిత్రపక్షాలకు బీజేపీని ఓడించడం తప్ప వేరే లక్ష్యమే లేదని వ్యాఖ్యానించారు.

పేదరికాన్ని నిర్మూలిస్తామని నెహ్రూ హయాం నుంచి చెబుతున్న కాంగ్రెస్, ఇప్పటివరకూ ఆ పని చేయలేకపోయిందని, తాజాగా న్యాయ్ అంటూ మరో పథకాన్ని తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు