తలాక్ పై ధర్మాసనం సభ్యులు ఏం అన్నారంటే

SMTV Desk 2017-08-23 14:58:02  Triple Talaq, Supreme Court judgement, verdict

న్యూఢిల్లీ, ఆగస్ట్ 23: ముస్లిం మహిళల జీవితాన్ని కాల రాస్తున్న ముమ్మారు తలాక్ పై సోమవారం 5గురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ ధర్మాసన సభ్యుల సుదీర్ఘ సమీక్షల అనంతరం మహిళలకు అండగా ఉంటూ ముమ్మారు తలాక్ విధానం చెల్లదంటూ కుండబద్దలుకొట్టింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ధర్మాసన తీర్పుపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినా, 3 : 2 ఆధిక్యంతో చరిత్రాత్మక తీర్పు వెలుగుచూసింది. చట్టాలతో పాటు ఖురాన్‌లోని అంశాలనూ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఉటంకించారు. ఈ చరిత్రాత్మక తీర్పు ఎందరో జీవితాలపై ప్రభావం చూపిస్తుందంటూ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ముమ్మారు తలాక్‌పై ధర్మాసనం సభ్యుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఈ విధానంతో పాటు ఖురాన్ చెప్పే మూల సూత్రాలకు వ్యతిరేకమైనవి ఎలాంటి వైనా ఆమోద యోగ్యం కాదు. తలాక్ ఏకపక్షంగా, రాజ్యంగ విరుద్ధంగా ఉంది. దీనిని రద్దు చేయాలని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. వివాహానికి పవిత్రతను, శాశ్వతత్వాన్ని ఖురాన్ కలుగచేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ విధానాన్ని అవలంబించాలి. అప్పుడూ రాజీకి ప్రయత్నం చేయాలి, ఫలిస్తే విడాకుల్ని వెనక్కి తీసుకోవాలి. అనంతరం ముమ్మారు తలాక్ అమలుచేయాలని ఖురాన్ తెలుపుతుంది. కానీ, ప్రస్తుత విధానం ఇలా జరగట్లేదు అని జస్టిస్ నారీమన్ అభిప్రాయపడ్డారు. ముమ్మారు తలాక్ ఖురాన్‌కు విరుద్ధంగా, షరియత్‌ను ఉల్లంఘించేదిగా ఉందంటూ జస్టిస్ జోసెఫ్ తెలిపారు. కాగా, జస్టిస్ ఖేహర్, జస్టిస్ నజీర్‌లు భిన్నభిప్రాయం వ్యక్తం చేశారు. ముమ్మారు తలాక్ మతపరమైన ఆచారం. దానిని ఆరు నెలల పాటు నిలుపు చేసి, ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ఒక అంశంపై చట్టం చేయాలంటూ సలహా ఇవ్వడం సరికాకపోయినా, ఈ కేసు కాస్త భిన్నం అంటూ ఆ ఇరువురు జస్టిస్‌లు తెలిపారు. తాజా తీర్పుతో ముస్లింలలో ఈ పద్దతి ఇక నుండి పాటించరాదు, ఒకవేళ పాటించిన చట్ట విరుద్ధం అవుతుంది. తలాక్‌ హసన్‌, తలాక్‌ అహ్‌సాన్‌ అనే విధానాల ద్వారా విడాకులు తీసుకోవచ్చును. తలాక్‌ అహ్‌సాన్‌ విధానంలో ముస్లిం పురుషుడు నెలకోసారి వరుసగా 3 నెలల పాటు తలాక్‌ చెప్పి విడాకులు పొందవచ్చు.