ఉత్తరప్రదేశ్ లో గెలుపు కోసం పలు కొత్త మార్గాలు

SMTV Desk 2019-05-05 18:16:33  priyanka gandhi,

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశంలో రాజకీయ నాయకులు పలు రకాల పాట్లు పడుతున్నారు. ఏ విధంగానైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలని జాతీయ పార్టీలు చూస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతుంది.

అయితే గత రెండు నెలలుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న ప్రియాంక మహిళలు, రైతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్తరప్రదేశ్ లో గెలుపు కోసం పలు కొత్త మార్గాలను వెతుకుతూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పలు వర్గాలు, రంగాల వారికి దగ్గరయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అదేవిధంగా ఆమె ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మదర్సాలు, ఉపాధి హామీ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు వ్యక్తిగత లేఖలు రాశారు. అందులో వారి సమస్యల్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆశా కార్యకర్తలకు రాసిన లేఖలో వారికి కేటాయించిన నిధులను పెంచుతామని ప్రియాంక హామీ ఇచ్చారు. ఆరోగ్యరంగానికి బడ్జెట్‌లో పెద్దపీట వేస్తామని తెలిపారు. ఆశా కార్యకర్తలారా.. గత కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాను. అందులో భాగంగా మిమ్మల్ని కలిసే అవకాశం నాకు లభించింది. మీ కష్టాలను విన్న తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ప్రస్తుత ప్రభుత్వం మీ న్యాయమైన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తోంది. ఇవన్నీ చూసిన తర్వాత మీ సమస్యల్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చడం అనివార్యమని భావించి ప్రత్యేకంగా అందులో పొందుపరిచాము అని ప్రియాంక లేఖలో పేర్కొన్నారు. ఇలా పలు రంగాల వారికి రాసిన లేఖల్లో వారి వారి సమస్యలన్ని లేవనెత్తుతూ.. వాటి పరిష్కారం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలపై వివరించారు.

అంతేకాకుండా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఉన్న వేతన బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మదర్సా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టి.. వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీలు గుప్పించారు.