బీజేపీ పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా అదే.... తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ

SMTV Desk 2019-05-05 18:07:21  pm modi, bihar, madhya pradesh, chattisgarh, telugu states

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ బీహార్ లోని రామ్ నగర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన అంశంపై వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆ రాష్ట్రాలు ఎంతో సఖ్యతతో కలసిమెలసి ముందుకు సాగుతున్నాయని వివరించారు.

బీహార్ నుంచి ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రాలు విడిపోయాయని, అక్కడి ప్రజలు ఎంతో ప్రేమతో విడిపోయారని చెప్పారు. పరస్పరం గౌరవించుకుంటూ అభివృద్థి పథంలో సాగుతున్నాయని మోదీ వివరించారు. కానీ, సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన పరిస్థితులు పూర్తిగా విభిన్నం అని వ్యాఖ్యానించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించింది కాంగ్రెస్ అని, ఇప్పటికి ఐదేళ్లు గడిచినా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిస్థితులు ఏమాత్రం చక్కబడలేదని అన్నారు. తెలుగు భాష మాట్లాడే ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి నెలకొందని వివరించారు. బీజేపీ పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది.