భారత దౌత్యవేత్తలను చిత్రహింసలకు గురి చేసిన పాకిస్తాన్

SMTV Desk 2019-05-05 17:54:58  indian ambassadors, pakistan, gurudwar, indian representatives

భారత దౌత్యవేత్తలపై పాకిస్థాన్ దారుణంగా ప్రవర్తించింది. ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌కు చెందిన ఇద్దరు దౌత్యవేత్తలను లాహోర్ సమీపంలోని ఫరూకాబాద్‌బాద్‌లో ఉన్న గురుద్వారా సచ్చా సౌదా సాహిబ్‌లో బంధించి చిత్ర హింసలు పెట్టిన విషయం బయటపడింది. మరోసారి ఈ ప్రాంతానికి రావొద్దంటూ పాకిస్థాన్ నిఘా సంస్థలు వారిని హెచ్చరించాయి.

గురుద్వారాను భారత సిక్కు యాత్రికులు సులభంగా సందర్శించేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యల నిమిత్తం ఇద్దరు దౌత్యవేత్తలు ఫరూకాబాద్‌ వచ్చారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన 15 మంది వారిని చుట్టుముట్టారు. వారి బ్యాగులను తనిఖీ చేశారు. అనంతరం గురుద్వారాలోకి తీసుకెళ్లి ఓ గదిలో వారిని బంధించారు. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ విధులేంటో చెప్పాలంటూ 20 నిమిషాలపాటు వారిని చిత్రహింసలకు గురిచేశారు.

అనంతరం వారిని విడిచిపెట్టిన నిఘా సంస్థ అధికారులు మరోమారు ఫరూకాబాద్ రావొద్దని, భారత యాత్రికులతో మాట్లాడొద్దని హెచ్చరించారు. అంతేకాదు, ఈ ఘటన మొత్తాన్ని వారు రికార్డు చేశారు. దౌత్యవేత్తలపై దాడిని ఖండించిన భారత్.. తమ నిరసనను వ్యక్తం చేసింది.