వినాయక చవితి సందర్భంగా ఇది మీ కోసం

SMTV Desk 2017-08-23 14:14:24  lord ganesh, plaster of paries, ganesh cahturdhi

హైదరాబాద్, ఆగస్ట్ 23 : గణేష్ పండుగ అంటే ప్రతి గడపకు సంబరమే. వీధి-వీధిలో వినాయక మండపాలు, నవరాత్రులు, ఘనమైన పూజలు, నిమజ్జనాలు, తొమ్మిది రోజులు ప్రతిది గొప్పగానే ఉంటుంది. అయితే గతంలో ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించే భక్తులు ఇప్పుడు పర్యావరణ హితమే లక్ష్యంగా గణేష్ పండుగకు సిద్ధమవుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేయబడిన వినాయక విగ్రహాలలో ఉండే రసాయనాలు పర్యావరణానికి హాని చేస్తున్నాయి. ఇది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలన్న విస్తృత ప్రచారం సాగుతుంది. నలుగు పిండితో పార్వతి దేవి తయారు చేసిన ప్రతిమతో జన్మించిన వినాయకుడిని, ప్రకృతి పరంగా లభించే శ్రేష్టమయిన మట్టితో తయారు చేసి పూజిస్తే అన్ని విధాలుగా శుభం కలుగుతుంద౦టారు పెద్దలు. కాని పర్యావరణ ప్రేమికులకు ఈ గణేష్ ఉత్సవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రొటీన్ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలని మట్టి గణపతి విగ్రహాలపై జనంలో అవగాహన పెరిగే కొద్ది, ఎకో-ఫ్రెండ్లీ విగ్రహాల తయారీ కూడా బాగా పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు గ్రీన్ గణపయ్యల గిరాకీ మరింత పెరిగింది. ఇటు తయారీ దారులు లాభాలు చూసుకోకుండా పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. చెరువు నుంచి తీసుకొచ్చిన మట్టితో భగవంతుడి రూపాన్ని తయారు చేసి నవరాత్రుల తరువాత మళ్లీ చెరువులోనే వదలటం సరైంద౦టున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు మట్టి గణపతులకు జై కొట్టాలంటున్నారు పర్యావరణ వేత్తలు. ప్రకృతి అంటే ఇష్టపడే వినాయకుడి విగ్రహాల్ని సైతం ఆయనకి ఇష్టం అయిన రీతిలోనే తయారు చేయాలంటున్నారు. విగ్రహాల కోసం నెల రోజుల ముందే మట్టిని తవ్వడం వల్ల పూడిక తీసినట్లవుతుంది. అంతేకాకుండా నీటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇటు వర్షాధారణ పంటలు వేసే సమయం కూడా కావడంతో ఇటు రైతులకు, పర్యావరణానికి ఎంతో ఉపయోగకరమైంది. మట్టితో తయారు చేసే విగ్రహాలు సైతం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. వాటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. మట్టి గణపతులను ప్రతిష్టించి, పూజించాలని ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం కూడా చేపట్టాయి. వినాయక చవితిలో మనం వాడే ప్రతి వస్తువు ప్రకృతితో ముడి పడి ఉంటుంది. అంతే కాదు ఇటు రైతులకు మేలు చేసేలా కూడా ఉంటుంది. పూజ అయిపోయిన తరువాత ప్రకృతి నుండి తీసుకున్న దాన్ని తిరిగి ప్రకృతికి ఇచ్చేయ్యాలన్న విధానంతో దేవుడిని తిరిగి నిమజ్జనం చేస్తారు. పైగా దేవుడికి వాడిన పత్రి, పూలు, అక్షింతలను నీటిలో ఉండే ప్రాణులు ఆహారంగా తీసుకుంటాయి. ప్రస్తుతం మట్టి గణపతులకే భక్తులు ఓటేస్తున్నారు. తాము పాటించడమే కాకుండా ప్రతి ఒక్కరు పాటించే విధంగా చైతన్యం తీసుకొస్తున్నారు. తమ వంతు బాధ్యతగా పర్యావరణంలో భాగం అవుతున్నారు. మరి మనం కూడా అందులో భాగస్వాములం అవుదామా..!!