విజయ భేరితో ఐపీఎల్ నుంచి తప్పుకున్న బెంగళూరు

SMTV Desk 2019-05-05 16:16:24  ipl 2019, srh vs rcb

ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడిన మ్యాచ్ లో బెంగుళూరు ఘన విజయం సాధించింది. బెంగుళూరుకు ఈ మ్యాచ్ ఐపీఎల్ లో ఆఖరి మ్యాచ్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు కేన్ విలియమ్సన్ (70 నాటౌట్: 43 బంతుల్లో 5x4, 4x6) అజేయ అర్ధశతకం బాదడంతో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఛేదనలో హెట్‌మెయర్ (75: 47 బంతుల్లో 4x4, 6x6), గుర్‌ప్రీత్‌సింగ్ మన్ (65: 48 బంతుల్లో 8x4, 1x6) మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో బెంగళూరు జట్టు 19.2 ఓవర్లలో 178/6తో లక్ష్యాన్ని ఛేదించేసింది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఆడేసిన హైదరాబాద్ జట్టు 12 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో నిలవగా.. ఆదివారం ముంబయి చేతిలో కోల్‌కతా (12 పాయింట్లు) ఓడిపోతేనే ప్లేఆఫ్‌కి చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోల్‌కతా గెలిస్తే..? టోర్నీ నుంచి హైదరాబాద్ నిష్క్రమించక తప్పదు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్ బెర్తులని ఖాయం చేసుకోగా.. ఆరు పరాజయాలతో సీజన్‌ని ఆరంభించిన బెంగళూరు విజయంతో ముగించడం విశేషం. మ్యాచ్‌లో గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన హెట్‌మెయర్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.