ముకేష్ అంబానీ మరో సంచలనం...ఒకే యాప్‌లో 100 సేవలు

SMTV Desk 2019-05-04 18:34:24  reliance, reliance jio, mukhesh ambani, 5g service, one app hundred services

ముంభై: రిలియన్స్ జియోతో సంచలనం సృష్టించి ప్రపంచ కుబేరుల లిస్టులో టాప్ లో ఉన్న ముకేష్ అంబానీ తన వ్యాపారంలో మరో మెట్టెక్కేందుకు ఓ భారీ ప్రాజెక్టుకు సిద్దమయ్యారు. ఆన్‌లైన్‌-సంప్రదాయ దుకాణాలను అనుసంధానించేలా, ప్రపంచంలోనే అతిపెద్ద ఇకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ సూపర్‌యాప్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చేస్తోంది. అమెజాన్‌, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా రూపొందిస్తున్న ఈ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మొబైల్‌ ద్వారా 4జీ డేటా సేవలు అందిస్తున్న రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ సహకారంతో దీన్ని అత్యధికులకు చేరువ చేయాలన్నది ముకేశ్‌ ప్రణాళిక.
* సూపర్‌యాప్‌లో ఇ కామర్స్‌ సేవలు, ఆన్‌లైన్‌ బుకింగ్‌లు, చెల్లింపుల వంటివన్నీ పూర్తి చేసుకోవచ్చు.
* 100కు పైగా సేవలు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అందించాలన్నది రిలయన్స్‌ ప్రణాళిక.
* రూ.588000 కోట్లు: 2021లో దేశీయ ఇకామర్స్‌ విపణిపై డెలాయిట్‌ ఇండియా, రిటైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అంచనా
* రూ.168000 కోట్లు: 2017లో దేశీయ ఇకామర్స్‌ విపణి స్థాయి
* 3 కోట్ల మంది వ్యాపారులు: ఇ కామర్స్‌ ద్వారా అనుసంధానించాలని ముకేశ్‌ అంబానీ నిర్దేశించుకున్న లక్ష్యం
ప్రస్తుతం రిలయన్స్‌ జియోకు 30 కోట్ల మందికి పైగా చందాదార్లున్నారు. అనేక టెక్‌ సంస్థలను కొనుగోళ్లు చేయడం, కొన్నింటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, అన్ని సేవలు ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురాగలుగుతున్నారు. త్వరలో ప్రారంభమ య్యే గిగాఫైబర్‌ సేవల ద్వారా, గృహ-కార్యాలయ-వాణిజ్య సంస్థలకు అత్యధిక వేగం డేటా ద్వారా, పూర్తిస్థాయి వినోద సేవలు లభించనున్నాయి. సూపర్‌యాప్‌కు ఇది కూడా ఉపయోగ పడుతుంది.
* సంభాషణా పూర్వక కృత్రిమ మేధ (ఏఐ), లాజిస్టిక్‌, ఏఐ ఆధారిత విద్యా సేవలు కూడా సూపర్‌యాప్‌ ద్వారా అందుబాటులో రానున్నాయి. రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ సామర్థ్యం అండగా ఉండటంతో, చైనాకు చెందిన వుయ్‌చాట్‌ స్థాయి యాప్‌ మనదేశం నుంచీ ఆవిర్భవించినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఈ ఘనతను స్నాప్‌డీల్‌, పేటీఎం, ఫ్రీఛార్జ్‌, ఫ్లిప్‌కార్ట్‌, హైక్‌ కూడా సాధించలేకపోయాయని చెబుతున్నారు.
ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ సేవలను కూడా అనుసంధానించే అవకాశం సూపర్‌యాప్‌ ద్వారా కలుగుతుందని, అన్ని సేవలు ఒకేచోట లభ్యమవుతాయి అని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ అధిపతి ప్రభురామ్‌ పేర్కొన్నారు.