న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ప్లిప్‌కార్ట్ క్రెడిట్‌కార్డులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్లిప్‌కార్ట్ తో పాటు ఓలా సంస్థ కూడా దీనికి సిద్దం అయ్యింది. పెద్దబ్యాంకుల సౌజన్యంతో ఈ సంస్థలు తమ వినియోగదారులకు క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ అంశంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. దీని ద్వారా తమ కార్డు వినియోగదారుల ఖర్చులపై ఒక అంచనాకు రావడంతో పాటు క్రెడిట్ కార్డ్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. భారత్‌లో ట్యాక్సీ సేవలు అందించే ఓలా.. క్రెడిట్ కార్డు సిస్టంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే వారం ఇందుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. తొలి ఏడాది ఒక మిలియన్ కార్డులను జారీ చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ కూడా యాక్సిస్ బ్యాంక్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ సౌజన్యంతో వినియోగదారులకు క్రెడిట్ కార్డులను త్వరలో అందించేందుకు ప్రణాళికలను చేస్తుంది.