దేశీయ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో చైనా ఫోన్ల డిమాండ్

SMTV Desk 2019-05-04 15:35:08  china, indian mobile phone market, china brands

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశీయ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో చైనా ఫోన్ల డిమాండే ఎక్కువగా ఉంది. 2019 మొదటి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి)లో స్మార్ట్‌ఫోన్లలో చైనా మార్కెట్ వాటా 66 శాతంతో రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సామ్‌సంగ్ (కొరియా), యాపిల్ (యుఎస్) వంటి సంస్థల ఆధిపత్యానికి విరుద్ధంగా భారత్‌లో చైనా బ్రాండ్లు రాజ్యమేలుతున్నాయి. క్యూ1లో భారత్‌లో మొత్తంగా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు నాలుగు శాతం పెరిగాయని ప్రపంచ టెలికాం కన్సల్టెన్సీ, రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ వెల్లడించింది. దీపావళి, -నూతన సంవత్సరం త్రైమాసికంలో అమ్మకాలు నిదానంగా ఉండగా, ఆ తరువాత నెలల్లో పుంజుకున్నాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్రపంచం, చైనా కంపెనీలను విపరీతంగా ఆకర్షిస్తోందని కౌంటర్ పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాథక్ అన్నారు. డేటా వినియోగం పెరగడంతో వినియోగదారులు తమతమ ఫోన్లను వేగంగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వినియోగదారులు తమ ఖర్చుల్లో ఎక్కువగా వీటికి కేటాయిస్తున్నారు. దీని ఫలితంగా వెంటవెంటనే మార్పును కోరుకుంటున్నారు. ఈ ట్రెండ్‌ను చూస్తే రాబోయే త్రైమాసికాల్లో మధ్యస్థాయి విభాగంలో పోటీ కొనసాగనుంది.