పంజాబ్ ఇంటికి... ప్లే ఆఫ్స్ రేస్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్

SMTV Desk 2019-05-04 12:19:59  panjab, KKR,

ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరో విజయాన్ని అందుకుంది. శుక్రవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. 184 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని కోల్‌కతా 18 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. ఓపెనర్లు క్రిస్ లిన్, శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన 22 బంతుల్లోనే మూడు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 46 పరుగులు చేశాడు. మరోవైపు అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ 49 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోరును సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు క్రిస్ గేల్ (14), కెఎల్.రాహుల్ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో పంజాబ్ 22 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు కోల్‌కతా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను భారీ షాట్లుగా మలచడంలో సఫలమయ్యారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ 26 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్స్‌తో 36 పరుగులు చేశాడు.

మరోవైపు పూరన్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసిన పూరన్ 27 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో మూడు బౌండరీలతో 48 పరుగులు చేశాడు. మరోవైపు మన్‌దీప్ సింగ్ ఒక ఫోర్, సిక్స్‌తో వేగంగా 25 పరుగులు సాధించాడు. చివర్లో యువ ఆల్‌రౌండర్ శామ్ కరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కోల్‌కతా బౌలర్లను హడలెత్తించిన కరన్ పరుగుల వరద పారించాడు. చెలరేగి ఆడిన కరన్ 24 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో ఏడు బౌండరీలతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో పంజాబ్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది.