నర్సింగ్ చేసిన నైపుణ్యాలు మాత్రం నహీ!!!

SMTV Desk 2017-08-22 16:51:04  NEWDELHI, NURSINGH GRADUATES, SKILLS, ASPIRING MINDS COMPANY

న్యూఢిల్లీ, ఆగస్ట్ 22 : ప్రతి ఏటా ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. కాని అందులో ఉద్యోగానికి పనికొచ్చే నైపుణ్యాలు ఉన్న వారు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా వైద్య వృత్తిలో ఎంతో ప్రాముఖ్యంగా భావించే నర్సుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. నర్సింగ్ లో గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసినా కూడా కనీస నైపుణ్యాలు కూడా లేవని తాజా సర్వేలో వెల్లడైంది. ఆస్పైరింగ్‌ మైండ్స్‌ కంపెనీ దేశంలో వివిధ ప్రాంతాల్లో నర్సింగ్ కోర్సును పూర్తి చేసుకున్న మూడు వేల మందిపై సర్వే నిర్వహించగా... నర్సింగ్‌ ట్రైనింగ్‌ పొందిన వారిలో కూడా కనీసం దాదాపు 40 శాతం మందికి రోజువారీ వాడే వైద్య పరికరాలపై కనీస అవగాహన లేదని ఈ సర్వేలో తేలింది. కొందరికి కనీసం జ్వరానికి థర్మామీటర్ లో ఎలా చూడాలో కూడా తెలియడం లేదని, ఇక ఆసుపత్రిలో చికిత్స పొందే రోగుల పర్యవేక్షణ ఎలా చూస్తారో ఏంటో? అసలు ఆసుపత్రుల్లో వైద్యుల కన్నా నర్సులే రోగులతో ఎక్కువ సమయం గడుపుతారు. మందులు ఇస్తూ, వాటిని ఎలా వాడాలో సూచనలు, సలహాలు ఇస్తుంటారు. కాని చిన్న చిన్న సేవలను కూడా సక్రమంగా చేయలేని నర్సింగ్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. పక్షవాతంతో బాధపడే ఒక పేషంట్ ను ఎలా కుర్చోపెట్టాలో, ఒక బెడ్ నుండి ఇంకో బెడ్ పైకి ఎలా మార్చాలో, వీల్ చైర్లో ఎలా కూర్చోబెట్టాలో కూడా 31-45% నర్సులకు అవగాహన లేదని ఆస్పైరింగ్‌ మైండ్స్‌ నివేదిక వెల్లడించింది. విచిత్రమేమిటంటే... ఆసుపత్రిలో పనిచేసేటప్పుడు ఎలాంటి రోగాలు రాకుండా ఉండేందుకు తమ స్వీయ రక్షణపై వారికి మాత్రం పూర్తి అవగాహన ఉంటుంది. నర్సింగ్ వ్యవస్థపై ఆరా తీయగా శిక్షణ పొందే కళాశాలలు, ఆసుపత్రుల్లో సరైన పరికరాలు కనీస వసతులు లేకపోవడం వల్లనే విద్యార్థులకు వైద్య పరికరాల గురించి, చికిత్స విధానాల గురించి అవగాహన కొరవడిందనే ఆరోపణలు వినిపించడం గమనార్హం.