శిల్పా ఆఫర్... ఉపఎన్నికల ముందురోజు మాత్రమేనా?

SMTV Desk 2017-08-22 16:50:31  YSRCP, Nandyala by-polls, Police, YS Jagan, Silpa Mohan Reddy

నంద్యాల, ఆగస్ట్ 22: మరో 12గంటల్లో నంద్యాల ఉపఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేయరాదని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి సుపరిచితమే. అయితే ఈ నేపధ్యంలో ప్రచార కార్యక్రమాలైతే జరగట్లేదు కానీ, ప్రలోభాలు శృతి మించుతున్నాయి. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న శిల్పా సహకార మార్కెట్‌లో తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు ఎన్నికలకు ఒక రోజు ముందు పొందవచ్చని ప్రచారం చేయగా, నేడు పలువురు నంద్యాలవాసులు అక్కడికి చేరుకున్నారు. పెద్దఎత్తున సరుకులను తక్కువ ధరలకు ఇస్తూ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో, తనిఖీలు చేసిన ఎన్నికల అధికారులు, ఆ ఆరోపణలు నిజమని తేల్చి, సిబ్బందిని బయటకు పంపించి, స్టోర్ ను మూసివేయించారు. కాగా, డబ్బులు, మద్యం పంచుతూ ఓ రెస్టారెంట్‌లో తెలుగుదేశం నేతలు సమావేశమైతే, పోలీసులు వాళ్ల వైపుకు వెళ్లడం లేదని వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.