సూపర్ ఓవర్‌లో బుమ్రాకి తిరుగులేదు!

SMTV Desk 2019-05-03 16:08:19  ipl 2019, srh vs mi, super over, jasprit bumrah

గురువారం రాత్రి వాంఖడే వేదికగా హైదరాబాద్‌తో ముంభై జట్టు తలపడిన మ్యాచ్ ముంభై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రెండు జట్ల స్కోర్లు సమమవగా.. సూపర్ ఓవర్ అనివార్యమైంది. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ.. ఇప్పటికే ఒత్తిడిని అధిగమించడంలో ఆరితేరిన బుమ్రా తెలివిగా సూపర్ ఓవర్‌లో బంతులు విసిరి ముంబయిని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోగా.. బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్ 2017 సీజన్‌లో గుజరాత్ లయన్స్ (ప్రస్తుతం టోర్నీలో లేదు)తో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లోనూ బుమ్రా ముంబయిని గెలిపించిన విషయం తెలిసిందే. సూపర్ ఓవర్‌లో తొలుత హైదరాబాద్ నుంచి మనీశ్ పాండే, మహ్మద్ నబీ బ్యాటింగ్‌కిరాగా.. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ చేశాడు. అయితే.. తొలి బంతికే రెండో పరుగు కోసం ప్రయత్నిస్తూ.. మనీశ్ పాండే రనౌటవగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్టిన్ గప్తిల్ రెండో బంతికి సింగిల్ తీశాడు. దీంతో స్ట్రైకింగ్‌కి వెళ్లిన మహ్మద్ నబీ మూడో బంతికి సిక్స్ బాది మంచి టచ్‌లో కనిపించాడు. కానీ.. నాలుగో బంతికి వ్యూహం మార్చిన బుమ్రా.. తన పదునైన అస్త్రం ‘యార్కర్‌’తో నబీని క్లీన్ బౌల్డ్ చేశాడు. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు పడితే టీమ్ ఆలౌటైనట్లే. దీంతో.. హైదరాబాద్ 8 పరుగులే చేయగలిగింది. అనంతరం ఛేదనలో హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ బ్యాటింగ్‌కి రాగా.. స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో హైదరాబాద్ సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేయించింది. కానీ.. తొలి బంతికే సిక్స్ బాదిన హార్దిక్.. రషీద్ ఖాన్‌ని ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఆ తర్వాత రెండో బంతికి అతను సింగిల్ తీయగా.. అనంతరం మూడో బంతికి రెండు పరుగులు రాబట్టిన పొలార్డ్ ముంబయిని గెలిపించాడు.