పసిడికి ఫుల్ డిమాండ్!

SMTV Desk 2019-05-03 12:24:14  Gold Rate, Silver rate, Bullion market

ముంభై: సెంట్రల్ బ్యాంకుల వ్యూహాత్మక కొనుగోళ్లు డిమాండ్ పెరగడంతో బంగారం డిమాండ్ కూడా బాగా పెరిగింది. దీంతో అంతర్జాతీయంగా 2019 తొలి త్రైమాసికంలో (జనవరి-మార్చి) పుత్తడి డిమాండ్ 7 శాతం పెరిగినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజాగా తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ దాదాపు 7 శాతం పెరుగుదలతో 1,053.3 టన్నులకు చేరుకుంది. సెంట్రల్ బ్యాంకులు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌) బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడం ఇందుకు కారణం. రానున్న రోజుల్లోనూ ఈ ట్రెండ్‌ కొనసాగవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. దేశీయంగా 2019 ఆర్ధిక సంవత్సర మొదటి త్రైమాసికంలో బంగారం గిరాకీ 125.4 టన్నులకు చేరింది. ఇది 4 ఏళ్ల గరిష్టం. అయితే డిమాండ్ పెరిగింది కానీ ధర మాత్రం పడిపోయింది. ఫిబ్రవరి నెల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి నెలలో ఒకానొకసమయంలో రూ.34,800 స్థాయికి చేరిన 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.32,600కు దిగొచ్చింది. ఇకపోతే దేశీ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ.32,620కు క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం సహా అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రెండ్ బలహీనంగా ఉండటం ఇందుకు కారణం.