ఎంసీసీ అధ్యక్షుడిగా సంగక్కర

SMTV Desk 2019-05-02 13:46:03  kumara sangakkara, srilanka, mcc

కొలంబో: శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. బుధవారం లార్డ్స్‌లో ఎంసీసీ వార్షిక సమావేశంలో ప్రస్తుత ఎంసీసీ అధ్యక్షుడు ఆంటోనీ రెఫార్ట్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సంవత్సరం అక్టోబరు 1న సంగక్కర బాధ్యతలు చేపట్టి సంవత్సరం పాటు సంగక్కర ఈ పదవిలో కొనసాగుతారు. ఎంసీసీకి అధ్యక్షుడిగా పని చేయబోతున్న తొలి బ్రిటిషేతరుడు సంగక్కర. క్రికెట్‌ నిబంధనల రూపకల్పనలో ఎంసీసీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 2012లో ఎంసీసీ గౌరవ జీవితకాల సభ్యత్వం అందుకున్న సంగక్కర క్లబ్‌ ప్రపంచ క్రికెట్‌ కమిటీలోనూ భాగమయ్యాడు. ఎంసీసీ అధ్యక్షుడిగా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నాను. అధ్యక్షుడిగా పనిచేయడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఎంసీసీ ప్రపంచంలోని గొప్ప క్రికెట్ క్లబ్. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడానికి నా వంతుగా కృషి చేస్తాను అని కుమార సంగక్కర తెలిపారు.