ఇన్ఫోసిస్‌ మాట... నష్టాల బాట

SMTV Desk 2017-08-22 13:24:03  Infosys, Vishal sikka resign, New infosys CEO, Narayana Murthy, Stock market, Sensex, Shares Rate

ముంబై, ఆగస్ట్ 22: ఇన్ఫోసిస్‌ సిఈఓగా విశాల్‌ సిక్కా రాజీనామా ప్రభావంతో స్టాక్ మార్కెట్ షేర్లు నష్టాల బాట పట్టాయి. ప్రారంభంలో నష్టాలను ఎదుర్కునే దిశగా అడుగులు పడినప్పటికీ ముగింపు సమయానికి నష్టాలను చవి చూడక తప్పలేదు. ఈ ప్రభావం ప్రధానంగా ఇన్ఫోసిస్‌ పై కనిపిస్తుంది. ఇన్ఫోసిస్‌ బైబ్యాక్‌ ప్రకటన జారీ చేసినప్పటికీ షేరు ఐదు శాతానికి పైగా దిగిపోయింది. మరోపక్క ఉత్తర కొరియాపై అమెరికా వైఖరి కారణంగా ఐటి షేర్లు క్షీణించడంతో మార్కెట్‌ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 266 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 9800 దిగువకు వచ్చింది. ఇన్ఫోసిస్‌ ప్రకటించిన 13 వేల కోట్ల రూపాయల విలువ గల షేర్ల బైబ్యాక్‌ ప్రణాళిక కూడా మార్కెట్‌ క్షీణతను నిలువరించలేకపోయింది. సెన్సెక్స్‌, నిఫ్టీ రెండింటిలోనూ నష్టాల్లో ఇన్ఫోసిస్‌ అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా రెండో రోజు కూడా ఇన్ఫోసిస్‌ షేరు నష్టపోయింది. బిఎ్‌సఇలో ఈ షేరు ఒక దశలో 5.75 శాతం నష్టంతో 52 వారాల కనిష్ఠ స్థాయి 870 రూపాయలకు దిగజారినా చివరికి కొంత కోలుకుని 5.37 శాతం నష్టంతో 873.50 వద్ద ముగిసింది. వరుసగా రెండు సెషన్లలో కంపెనీ 33,911.93 కోట్ల రూపాయల మేరకు మార్కెట్‌ విలువను నష్టపోయి 2,00,640.07 కోట్ల రూపాయలకు దిగజారింది. ఇన్ఫోసిస్‌ ప్రభావంతో ఐటి ఇండెక్స్‌ 2.04 శాతం మేరకు నష్టపోయింది. ఫలితంగా సెన్సెక్స్‌ 265.83 పాయింట్ల నష్టంతో 31.258.85 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 83.05 పాయింట్ల నష్టంతో 9754.35 పాయింట్ల వద్ద ముగిసింది. నష్టపోయిన షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, ఔన్‌జిసి ఉన్నాయి. ఇన్ఫోసిస్‌ ప్రకటన కూడా మార్కెట్‌ను మురిపించలేదని, ఫలితంగా ప్రారంభంలోని బలాన్ని నిలబెట్టుకోలేక మార్కెట్‌ భారీ నష్టాలతో ముగిసిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.