మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం!

SMTV Desk 2019-05-01 12:33:39  central governments, reserve bank of india, rbi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే దేనా, విజయ, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీన ప్రక్రియను పూర్తి చేసిన కేంద్ర ఇప్పుడు మరో మూడు బ్యాంకులను ఏకం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వ బ్యాంకులకు విలీనానికి సంబంధించిన కబురు పంపించనుందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈసారి వీలినం అయ్యే బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ మూడు బ్యాంకుల విలీనానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ఈ బ్యాంకుల విలీనం జరగొచ్చని అంచనా వేశారు. అయితే ఇతర ప్రభుత్వ అధికారులు ఈ వార్తను కొట్టిపారేశారు. దీనికి అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మళ్లీ బ్యాంకుల విలీనానికి ఇది సరైన సమయం కాదని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యల నుంచి బయటపడిందని గుర్తు చేశారు. అలాగే పీఎన్‌బీ, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రికవరీ దశలో ఉన్నాయని తెలిపారు.బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి బ్యాంకుల విలీనం ఒక్కటే సమాధానం కాదని ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. సమస్యల పరిష్కానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఉత్తమమని సూచించారు.