మోదీ హిట్లర్ కు తాత .. దీదీ సంచలనం

SMTV Desk 2019-05-01 12:32:45  Modhi, Mamata Benerjee,

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై తన దైన శైలిలో విమర్శలు గుప్పించారు. తమతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యల మీద ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల ఎన్నికల ప్రచారం లో మోదీ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని, దీదీని వదిలిపెట్టడం ఖాయమని పేర్కొన్నారు. తమతో ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలపై మమత నిప్పులు చెరిగారు. దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేనైనా తీసుకెళ్లాలంటూ సవాలు విసిరారు.

బీజేపీలా తమకు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే సంప్రదాయం లేదని ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతున్న మోదీ లోక్‌సభ నామినేషన్‌ను వెంటనే రద్దు చేయాలంటూ ఈసీకి తమ పార్టీ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మోదీ వ్యాఖ్యలు రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమని రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా? అని మండిపడ్డారు. మోదీని అత్యంత నియంతగా అభివర్ణించిన ఆమె ఆయన హిట్లర్‌కు తాత అని మండిపడ్డారు. మోదీ బెదిరింపులకు తాను భయపడలేదని దీదీ స్పష్టం చేశారు. పులిలా పోరాడతానని బారక్‌పూర్ లోక్ సభ నియోజక వర్గ పరిధిలోని అమదంగలో నిర్వహించిన ప్రచార సభలో ఆమె తెలిపారు. ఆయనకు బెంగాలీ సంస్కృతి తెలియదన్న ఆమె అందరూ తన సేవకులేనన్న భావనలో మోదీ ఉంటారని విమర్శించారు.