ఆశారం బాపూ కుమారుడు నారాయణ్ సాయికి జీవిత ఖైదు

SMTV Desk 2019-05-01 12:30:53  Asharam Baapu, Court,

అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారం బాపూ కుమారుడు నారాయణ్ సాయికి కూడా జైలుశిక్ష పడింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను దారుణంగా అత్యాచారం చేసిన కేసులో అతడు దోషిగా తేలడంతో అతనికి కోర్ట్ జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా లక్షరూపాయల జరిమానాను కూడా విధిస్తూ.. సూరత్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.

అదేవిధంగా అత్యచారం కేసులో నారాయణ సాయిని దోషిగా నిర్దారిస్తూ ఈనెల 26న కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇతర నిందితులైన గంగ, జమున, హనుమాన్ అలియాస్ కౌశల్‌కు పదేళ్ల చొప్పున జైలు, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానాను కోర్టు విధించింది. మరో నిందితుడు రమేష్ మల్హోత్రాకు ఆరు నెలలు జైలు విధించింది. అత్యాచార బాధిత సిస్టర్స్‌లో ఒకరికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని కూడా సెషన్స్ కోర్టు తాజా తీర్పులో ఆదేశించింది.

అంతేకాకుండా ఆశారాం బాపు, అతడి కొడుకు నారాయణ్ సాయి తమపై అత్యాచారం చేశారంటూ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు 2013లో పోలీసులను వేర్వేరుగా ఆశ్రయించారు. ఆశ్రమంలో నివసించే సమయంలో 2002 నుంచి 2005 మధ్య కాలంలో తనపై నారాయణ్ సాయి పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంటూ వారిలో ఓ మహిళ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు తర్వాత నారాయణ సాయిని అరెస్టు చేసి కోర్టు ముందు నిలబెట్టారు. ఈ అత్యాచారం కేసుతో పాటు అనేక కేసుల్లో నారాయణ సాయి నిందితుడిగా ఉన్నాడు. కాగా ఆశారాం బాపు ఇంతకు ముందే అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే.