కుమార్తె సాయంతో ఎట్టకేలకు విజయం సాధించిన తండ్రి

SMTV Desk 2019-05-01 12:29:00  puducherry, father-daughter, ssc results, tamilnadu

చెన్నై, మే 01: తమిళనాడులో తన కుమార్తె శిక్షణతోనే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించానని, ఈ విజయం ఆమెకే అంకితమని ఓ తండ్రి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు విడుదలైన విషయం తెలిసిందే.

కేంద్రపాలిత రాష్ట్ర మైన పుదుచ్చేరిలో తండ్రి, కుమార్తెలు పాసై అందరినీ ఆశ్చర్యపరిచారు. కూడపాక్కం రైస్‌ మిల్‌ ప్రాంతానికి చెందిన సుబ్రహణ్యం (45) ప్రభుత్వ ఉద్యోగైన ఆయన 7వ తరగతి వరకు చదువుకోవడంతో.....ఇప్పుడు పదోన్నతి పొందడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రమోషన్‌ కోసం చదువుకోవాలని నిర్ణయించారు. 2017లో 8వ తరగతి ఉత్తీర్ణుల య్యారు.

2018లో టెన్త్‌ పరీక్షలు రాగా, సైన్స్‌, సోషల్‌ మినహా మిగిలిన మూడింటిలో ఫెయిలయ్యారు. జూన్‌లో జరిగిన సప్లిమెంటరీలో ఈ మూడు సబ్జెక్టులు రాశారు. అందులోను ఆయన లాంగ్వేజీలో మాత్రం ఉత్తీర్ణత పొందడంతో సెప్టెంబరులో జరిగిన సప్లిమెంటరీలో ఆంగ్లం, గణితంలో ఫెయిలయ్యారు. దీంతో మనస్థాపానికి గురైన సుబ్రహణ్యం చదువును మానుకోవాలని నిర్ణయించుకున్నారు. తండ్రి ఆవేదనను గమనించిన టెన్త్‌ చదువుతున్న కుమార్తె త్రిగుణ ధైర్యం చెప్పింది. తండ్రికి పాఠాలు బోధించింది. గతనెలలో కుమార్తెతో పాటు, సుబ్రహ్మణ్యం కూడా పరీక్ష రాశారు.

సోమవారం ఈ పరీక్ష ఫలితాలు విడుదల కావడంతో త్రిగుణ 471 మార్కెలు పొంది పాఠశాలలో ద్వితీయ స్థానం పొందగా, తండ్రి సుబ్రహ్మణ్యం ఆంగ్లం, గణితం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఒకే సమయంలో పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన తండ్రి కూతుర్లకు పలువురు అభినందన తెలుపుతున్నారు. వీరు ఎంతో మందికి ఆదర్శం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.